ప్రముఖ అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటర్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. సనంద్ (గుజరాత్), చెన్నె (తమిళనాడు) నగరాల్లోని ప్లాంట్లను ఫోర్డ్ మూసివేయనుంది. కంపెనీకి భారీ నష్టాలు, బహిరంగ మార్కెట్‌లో వృద్ధి లేకపోవడంతో ఫోర్డ్ మోటర్ కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022 రెండో త్రైమాసికం నాటికి చెన్నైలోని ప్లాంట్‌ను మూసివేస్తామని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతమున్న స్టాక్ పూర్తయ్యేవరకు విక్రయాలు కొనసాగుతాయని, ఆ తర్వాత దిగుమతి చేసుకునే ముస్టాంగ్ లాంటి వాహనాలను మాత్రమే విక్రయిస్తామని ఫోర్డ్ తెలిపింది. గత 10 ఏళ్లుగా ఫోర్డ్ 2 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను చవిచూసింది. భవిష్యత్‌లో అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో వాహనాలు, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల తయారీపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు కంపెనీ వెల్లడిరచింది.