భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియల్ టైం చెల్లింపుల వ్యవస్థ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్పేస్ త్వరలో బ్రిటన్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ రూపకర్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. చెల్లింపు సంస్థ పేఎక్స్‌పర్ట్ సహకారంతో బ్రిటన్‌లోనూ యూపీఐ సేవలు త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఈ ఒప్పందంతో యూకేలోని అన్ని పేఎక్స్‌పర్ట్ ఆండ్రాయిడ్ పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) డివైజుల్లో భారతీయ పేమెంట్లు కూడా చేసుకునే అవకాశం కలుగుతుంది. ముందుగా యూపీఐ అధారిత క్యూఆర్ కోడ్ పేమెంట్స్ అందుబాటులోకి వస్తాయి. నెమ్మదిగా రూపే కార్డు పేమెంట్లను కూడా యూకేలో అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్పీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఏటా సుమారు 5 లక్షల మంది భారతీయులు యూకే వెళ్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. వీరందరికీ ఈ భాగస్వామ్యం వల్ల లబ్ది చేకూరుతుందని ఎన్పీసీఐ తెలిపింది.














