జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్‌కు ఆర్థోస్కోపిక్ సర్జరీ నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. సర్జరీ అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే భుజం పూర్తిగా కోలుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ సమయంలో తారక్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనల మేరకు రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ వంటి ప్రక్రియలను కొనసాగించాల్సి ఉంటుంది.

ఇక సర్జరీ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ప్రార్థనలు తనకు ఎంతో బలాన్ని ఇస్తున్నాయని తెలిపారు. మీరందరూ చూపించిన ప్రేమ, అందించిన ప్రార్థనలకు నా మనసు నిండిపోయింది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. నేను క్షేమంగా ఉన్నాను అంటూ అభిమానులకు భరోసా ఇచ్చారు. అలాగే తనకు చికిత్స అందించిన కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు వైద్యం అందించిన అద్భుతమైన వైద్య బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.















