అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. భారీఎత్తున బహిష్కరణ డ్రైవ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సరైన పత్రాలు లేని దాదాపు 18,000 మంది భారతీయులు కూడా ఈ బహిష్కరణను ఎదుర్కొంటున్న వారిలో ఉన్నట్టు సమాచారం. ట్రంప్ యంత్రాంగం బహిష్కరణల కోసం సైనిక విమానాలను ఉపయోగించడానికి సిద్ధమవుతున్నది. బహిష్కరణను ఎదుర్కొంటున్న భారతీయ అక్రమ వలసదారులకు చట్టపరమైన పరిష్కారాలు దొరికే అవకాశం చాలా పరిమితంగా ఉండవచ్చని, చాలామందికి అప్పీళ్లు, అభ్యర్థనలు లేదా న్యాయపరమైన ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉండకపోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

మరోవైపు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) బృందాలు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. అమెరికాలోని నాలుగు నగరాలైన న్యూయార్క్, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో ఈ బహిష్కరణ ప్రచారం అక్రమ వలసదారుల జీవితాలను పూర్తిగా మార్చేసింది. డిటెన్షన్ సెంటర్లలో నిర్బంధించిన ప్రజలపై జరిగిన దుర్మార్గానికి సంబంధించిన కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి.














