అమెరికా తరచూ తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్నదని, మాపై ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విమర్శించారు. ఆంక్షలతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం అని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దౌత్య మార్గంలో లక్ష్యాలను సాధించలేనప్పుడల్లా అమెరికా ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు.

లక్ష్యాలు అందుకోలేకపోతే ఆంక్షల తీవ్రత మరింత పెంచుతోందని బఘాయి విమర్శించారు. ఇది ఒక అలవాటుగా, చివరకు వ్యసనంగా మారిందని ఆయన మండిపడ్డారు. ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని బఘాయీ స్పష్టంచేశారు. దశాబ్దాలుగా ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొంటూనే ఉన్నామని చెప్పారు. అమెరికా నేతలు ఈ చెడు అలవాటును కొనసాగిస్తే, సంక్షోభం నుంచి గౌరవప్రదంగా బయటపడే అవకాశాలను వారే దెబ్బతీసుకుంటారని హెచ్చరించారు.





























