భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మూసివేసిన భారత రాయబార కార్యాలయాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి తిరిగి ఓపెన్ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా భయంకరమైన బాంబు దాడుల నేపథ్యంలో కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌కు తరలించారు. మార్చి 13వ తేదీ నుండి పోలాండ్లోని వార్సా నుంచి తాత్కాలికంగా భారత రాయబార కార్యాలయం సేవలను కొనసాగించారు. అక్కడి నుంచి ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి భారతీయులను తరలించారు.
రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చింది. కీవ్ స్వాదీనంపై వెనక్కి తగ్గింది. మరియుపోల్ వంటి తీర ప్రాంత నగరాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని పునరుద్ధరించాలని కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వార్సా (పోలాండ్) నుండి తాత్కాలికంగా పనిచేస్తున్న ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం 17 మే నుంచి కీవ్‌లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది అని అందులో పేర్కొంది.














