పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లిన భారత సంతతికి చెందిన విక్రమ్ ముబాయి జీవితం విషాదంగా ముగిసింది. రెండు రోజుల క్రితం ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన అతడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న అతడు విగతజీవిగా కనిపించాడు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, విక్రమ్ మృతిపై తమకు ఎలాంటి సందేహాలు లేవని అధికారులు తెలిపారు.

సాంటాబర్బరాలోని క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న విక్రమ్ ముబాయి రెండు రోజుల క్రితం హైకింగ్(అడవులు, కొండ ప్రాంతాలు, పర్వతాల గుండా నడవడం)కు వెళ్లాడు. వారాంతం కాబట్టి ఆగస్టు 1వ తేదీన ఒంటరిగా పైన్ లేక్స్ ప్రాంతంలో హైకింగ్‌కు వెళ్లిన అతడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. విక్రమ్ నుంచి ఫోన్ రాకపోవడంతో అప్రమత్తమైన అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో, అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలించారు.





























