తెలంగాణ మొత్తం మాట్లాడుకుంటున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే బీజేపీ తప్ప అధికార టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఇక్కడ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధిష్టానం దీనిపై బాగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి కూడా హుజూరాబాద్‌లో టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే హూజూరాబాద్‌లో అధిక సంఖ్యలో ఉన్న దళితుల ఓట్లను దళిత బంధుతో ఆకర్షించిన టీఆర్ఎస్.. మిగతా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థిని ఎంపిక చేయాలనుకుంటోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో కరీంనగర్ మాజీ ఎంపీ వివేక్ పేరు కూడా తెరమీదకు వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్లందర్నీ కాదని టీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈటల తరఫున ఉద్యమ నాయకులు ప్రచారం చేసే అవకాశం ఉందని వార్తలు రావడంతో.. దీనికి కౌంటర్‌గా విద్యార్థుల బలాన్ని చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఓయూ విద్యార్థి సంఘం నేతగా కూడా శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకుడిగా మారారు. హుజూరాబాద్ టికెట్ శ్రీనివాస్ యాదవ్‌కు గ్యారంటీ అని, దీనిపై అధికారిక ప్రకటన రావడమొక్కటే తరువాయి అని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.