ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈ ఏడాది ఎండాకాలంలో అమెరికా పర్యటనకు రావాల్సిందిగా మోదీని బైడెన్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బైడెన్ ఆహ్వానాన్ని పీఎంవో కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మోదీ అమెరికా పర్యటన తేదీల విషయంలో ఇరు దేశాల నేతలు కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
జూన్ లేదా జులై నెలల్లో మోదీ పర్యటన ఉండొచ్చని సమాచారం.అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం వైట్ హౌస్లో జరగనున్న విందులో కూడా పాల్గొంటారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి.














