ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ అబద్ధాలు, మోసంతోనే రెండు సార్లు సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు. పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకున్నారని మండిపడ్డారు. పెట్రో ధరలు తగ్గేంత వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఐజీ ప్రభాకర్‌రావుపై రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ఐజీ ప్రభాకర్ రావు ఖాసీం రిజ్విగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఐజీ ప్రభాకర్ రావు వ్యవహారాన్ని తాము కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని రేవంత్ స్పష్టం చేశారు. మరోవైపు పోలీసుల వ్యవహారంపై కూడా రేవంత్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా తాము నిరసన చేపడితే, పోలీసులు తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడిచిపెట్టాలని, శాంతియుత నిరసనను అడ్డుకుంటే లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగుతామని రేవంత్ హెచ్చరించారు.