ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయిద్‌కు పాకిస్థాన్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసులకు సంబంధించి ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే రూ.3,40,000 జరిమానా కూడా విధించింది. హఫీజ్ సయిద్‌కు చెందిన ఆస్తులన్నీ సీజ్ చేయాలని పాక్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన నిర్మించిన మసీదు, మదర్సాను అధికారులు స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కేసుల్లో 70 ఏండ్ల హఫీజ్ సయిద్‌కు పలు సార్లు జైలు శిక్షలు పడ్డాయి. 2020లో టెర్రర్ ఫండిరగ్ కేసులో యాంటీ టెర్రర్ కోర్టు 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
ఇదిలా ఉంటే 2008 నవంబర్ 26న జరిగిన ముంబయి ఉగ్ర దాడుల్లో హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అతని ప్లాన్ మేరకే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన టెర్రరిస్టులు సముద్ర మార్గం ద్వారా ముంబయిలోకి చొరబడి పలు ప్రాంతాల్లో మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 175 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు.














