మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో భారతీయ మూలాలున్న మలేషియన్కి సింగపూర్ ప్రభుత్వం అమలు జరపాల్సిన ఉరిశిక్ష ఆగిపోయింది. నాగేంద్రన్ కె ధర్మలింగానికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మరణ శిక్ష అమలు వాయిదా వేయాలని సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 42.72 గ్రాముల హెరాయిన్ను సింగపూర్కి తరలించడానికి నాగేంద్రన్ ప్రయత్నించడంతో 2010లో అక్కడి కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. చివరి అప్పీలుపై నాగేంద్రన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అధికారులు వెంటనే బయటకు తీసుకుపోయారు. అతనికి కొవిడ్ 19 సోకినట్లు అనంతరం జడ్జి ప్రకటించారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తుల్లో ఒకరైన ఆండ్రూ ఫాంగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది అనూహ్య పరిణామం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు వెళ్లడమనేది సమంజసం కాదని న్యాయస్థానం భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
సింగపూర్లో డ్రగ్స్ చట్టాలు కఠినంగా ఉండడంతో కొన్నేళ్లుగా నాగేంద్రన్ తరపు లాయర్లు వివిధ కోర్టుల్లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి అధ్యక్షుడి క్షమాభిక్ష కూడా లభించ లేదు. ఉరిశిక్ష అమలు తేదీ దగ్గర పడుతూ ఉన్న సమయంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. నాగేంద్రన్ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడంతో శిక్షను తగ్గించడానికి ప్రయత్నించింది.














