భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు మరో ఆరు నెలలు పట్టనుంది. ఈ మేరకు నాసా కీలక ప్రకటన చేసింది. సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బారీ విల్‌మోర్‌ను ఫిబ్రవరిలో తీసుకువస్తామని, అప్పటివరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే వీరు ఉంటారని నాసా ప్రకటించింది. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు వచ్చినందున, దీంట్లో తిరుగు ప్రయాణం ప్రమాదకరమని నాసా నిర్ధారించింది.
ఈ నేపథ్యంలో వ్యోమగాములు లేకుండా ఆటోపైలట్ పద్ధతిలో దీనిని తిరిగి భూమి మీదకు తీసుకురావాలని నిర్ణయించింది. కాగా, ఎనిమిది రోజులు మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ జూన్ 5న బయలుదేరారు. వీరు వెళ్లేటప్పుడే వ్యోమనౌకలో హీలియం లీక్ కావడంతో ప్రోపల్షన్ వ్యవస్థలో లోపాలు, వాల్వ్‌లో సమస్యలు వచ్చాయి. ఎలాగోలా జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు.