భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధానికి తానే తెరదించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలంగా శత్రువులుగా ఉన్న దేశాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందని ఆయన అన్నారు. నాలుగు రోజుల సైనిక వివాదం తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానన్న తన వాదనను ట్రంప్ పునరుద్ఘాటిస్తూ అదే మాదిరి ఇరాన్-ఇజ్రాయెల్ కూడా ఒక ఒప్పందానికి రావాల్సి ఉందని, ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

త్వరలోనే రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న మొదటి విడత సమయంలో కూడా పలు దేశాల మధ్య ఉన్న వైరాన్ని తొలగించి శాంతిని నెలకొల్పినట్టు ఆయన తెలిపారు. సెర్బియా, కొసావో దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి విభేదాలను తొలగించి, ఇద్దరికీ రాజీ కుదిర్చినట్టు చెప్పారు.
