ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఒకటి ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లు అయితే మరొకటి విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019లో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును మండలిలో టీడీపీ సభ్యులు వెనక్కి పంపించారు. దీంతో గతేడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరోమారు బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టి ఆమోదించింది.
అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించడంతో గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వీకే పట్నాయక్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులకు పంపిన అధికారిక సమాచారం చేరింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి నెరవేర్చినట్లయింది. ఇప్పటి వరకు ఒకే కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయడం వల్ల అవి మరింత సమర్థవంతంగా పని చేసే వీలు కలుగుతుంది.