లోక్‌సభ నిరవధిక వాయిదా అనంతరం అరుదైన సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. దిగువ సభలోని వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు స్పీకర్ ఓంబిర్లా చాంబర్‌కు చేరుకున్నారు. ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఓంబిర్లాను కలిసిన వారిలో ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్షనేత అధిర్ రంజన్, అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌బాదల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషితో పాటు టీఎంసీ, బీజేపీ వైకాపా నేతలున్నారు. వీరంతా స్పీకర్ చాంబర్‌కు ఒకేసారి చేరుకున్నారు. అందరూ కలిసిన గ్రూప్ ఫొటో దిగారు. ఓంబిర్లా, మోదీ ఒక సోఫాలో కూర్చోగా మరొక సోఫాలో సోనియా గాంధీ, అధిర్ కూర్చున్నారు. స్పీకర్‌కు కుడివైపు అమిత్ షా ఆసీనుడయ్యాడు. హోంమంత్రి పక్కన ప్రహ్లాద్‌జోషి, ఆయన పక్కన టీఎంసీ నేతలు కూర్చున్నారు. భవిష్యత్‌లో పార్లమెంట్‌లో చర్చను ప్రోత్సహించేలా వ్యవహారించాలని ఈ సందర్భంగా ఓంబిర్లా అన్ని పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. వర్షాకాల సమావేశాల్లో పరస్పరం విమర్శలు, వాగ్వాదాలతో గడిపిన అధికార, విపక్షాలు నేతలు ఈ సన్నివేశంలో సరదాగా, చిద్విలాసంగా కనిపించారు.