దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం సీతారామం. సుమంత్ కీలక పాత్ర పోషించారు. ఇందులో అఫ్రీన్ అనే కశ్మీరీ ముస్లిం యువతిగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ను విడుదల చేశారు. అందులో రష్మిక హిజాబ్ ధరించి ఈద్ శుభాకాంక్షలు చెబుతూ కనిపించింది. కథాగమనంలో రష్మిక మందన్న పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమికులకు వారధిలా ఆమె ఎలాంటి పోరాటం చేసిందన్నది ఆసక్తినిరేకెత్తిస్తుంది. 1965 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే అందమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. ఇందులో దుల్కర్ లెఫ్ట్‌నెంట్ రామ్‌గా కనిపించనున్నారు. సీత పాత్రను మృణాల్ పోషించింది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆగస్టు 5న విడుదల కానుంది.














