ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండానే మార్కులు ప్రకటించామని, మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఈ యేడాది పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పదో తరగతి మార్కులకు 30 శాతం, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు సరాసరి గ్రేడ్ పాయింట్లను కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ… సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే నిర్ణయించిన తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఫలితాలను వెల్లడిస్తున్నామని పేర్కొన్నారు. మార్కులు ఎలా ఇవ్వాలన్న దానిపై ఓ కమిటీ వేశామని, ఆ కమిటీ ఆధారంగానే ఫలితాలను విడుదల చేస్తున్నామన్నారు. ఫలితాలపై విద్యార్థులకు అసంతృప్తి ఉంటే కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగానే ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్‌మెంట్ పేరుతో పరీక్షలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.