తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోని నీరు వచ్చిచేరడంతో నివసించడానికి ఇబ్బందిగా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణలోని నిర్మల్, భైంసా ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నిర్మల్ నగరంలో వాన దంచి కొట్టింది. కాలనీలు నీట మునిగిపోయాయి. కుండపోత వర్షాల కారణంగా స్వర్ణ, కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఒక్కసారిగా గేట్లెత్తేశారు. గేట్లు ఎత్తివేయడంతో నిర్మల్, భైంసా ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో చాలా మంది నీటిలో చిక్కుకుపోయారు.
జలదిగ్బంధమైన నిర్మల్
భారీ వర్షాల కారణంగా నిర్మల్ పట్టణం జలదిగ్బంధమైంది. ఇళ్లలోకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండలాగా మారిపోయింది. ప్రాజెక్టు ఎగువ భాగంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి నీటి వరద పోటెత్తింది. నిర్మల్ నీట మునగడంతో ఎన్డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు కృషి చేస్తున్నాయి.
మంత్రి ఇంద్రకరణ్‌తో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్
నిర్మల్ పట్టణం నీట మునగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో సంభాషించారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉంటూ ప్రజలను చూసుకోవాలని కోరారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం కేసీఆర్ మంత్రి ఇంద్రకరణ్‌కు సూచించారు.