వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్య కారణంగా 8 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వారిని భూమికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమవుతూ వస్తున్నాయి. దీంతో వీరి రాకపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే వీరు భూమి మీదకు తిరిగి రానున్నట్లు తెలిసింది.
రీ షెడ్యూల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే మార్చి చివరి వారం లేదా, ఏప్రిల్ మొదటి వారంలో వీరుభూమిపైకి తిరిగి వస్తారని ఇప్పటికే నాసా తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే ఈ ఇద్దరు వ్యోమగాములు భూమికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యోమగాములను మార్చి 12 నాటికి భూమిపైకి తీసుకొచ్చేందుకు టార్గెట్ గా పెట్టుకున్నట్లు నాసా వర్గాలు వెల్లడించినట్లు తెలిసింది. అంతరిక్షంలో చిక్కుకున్న ఈ ఇద్దరు వ్యోమగాములను తిరిగి రప్పించేందుకు స్పేస్ ఎక్స్ 10 మిషన్ కోసం గతంలో ఉపయోగించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ను ఉపయోగించనున్నట్టు సమాచారం.
