తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 తలుపులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ విచారణ జరిపింది. పిటిషనర్ ఎలాంటి పరిశోధనా జరపకుండా ఈ పిటిషన్ దాఖలు చేయడంపై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పిటిషన్‌ను కొట్టివేసింది. తాజ్ మహల్ గురించి పెద్ద చరిత్ర ఉంది. దానిని లోతుగా అధ్యయనం చేసి ఆ తర్వాత పిటిషన్ దాఖలు చేయడం సబబుగా ఉంటుందంటూ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యయ, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయోధ్యకు చెందిన డాక్టర్ రజనీష్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిఎస్ ఓకే అనే చరిత్రకారుడు రాసిన పుస్తకంలో తాజ్‌మహల్‌ని 1212లో పర్మిద్ది దేవ్‌రాజే రాజు నిర్మించారనీ, దీని అసలు పేరు తేజో మహాలయమనీ, దీని లోపల శివుని ఆలయం ఉందని, మూసీ ఉంచి 22 తలుపులను తెరిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని దీనిపై నిజనిర్ధారణ కమిటీని నియమించేట్టు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటషనర్ కోరారు.
22 తలుపుల వెనుక ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లో ఉందనీ, దానికి కోర్టు వారు సహకరించాలని కోరారు. దానిపై ధర్మాసనం స్పందిస్తూ తాజ్ మహల్ చరిత్రను అధ్యయనం చేయాలని లోతుగా పరిశోధన చేసిన తర్వాతనే ప్రశ్నలు వేయాలనీ, పసలేని ప్రశ్నలు వేయరాదని పేర్కొంది. అంత ఆసక్తి ఉన్నప్పుడు చరిత్రను పరిశోధించే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. కాగా తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ సమాధిగా నిర్మించాడు అని చరిత్ర చెబుతోంది. పాలరాతి స్మారక కట్టడం 1632లో ప్రారంభమైంది చివరకు 1653లో పూర్తి చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది. అది ఇంత గొప్ప కట్టడం కాబట్టే 1982లో యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.














