Skip to main content

Namaste NRI

టాలీవుడ్ ‎లో విషాదం.. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ఇక లేరు

 ప్రముఖ నటుడు, రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి మొగల్తూరులో జన్మించారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశారు.  1966 లో చిలకా గోరింకా చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేశారు. అవేకళ్లు చిత్రంలో ప్రతినాయకుడిగానూ నిరూపించుకున్నారు. 1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ ఫేర్‌ దక్షిణాది జీవిత  సాఫల్య పురస్కారం పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.  187 చిత్రాల్లో నటించారు. 

                విజయనగర సామ్రాజ్య క్షత్రియ వంశానికి చెందిన కృష్ణంరాజు దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగానూ  సేవలందించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే ప్రముఖ నటుడు ప్రభాస్‌. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు అభిమానుల సందర్శనార్థం తీసుకొస్తారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మధ్యామ్నం తర్వాత కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. కాగా కృష్ణంరాజు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events