దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకల సందడి మొదలైంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే భాగ్యనగరంలో జరిగే గణేశ్ పండుగకు నగరం ముస్తాబయింది. మండపాలను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు విగ్రహాలను సిద్ధం చేసుకున్నారు. నగరంలో రోడ్లపై విగ్రహాల తరలింపునకు సంబంధించిన వాహనాలతో కోలాహలం నెలకొంది. పండుగ పూజ సామగ్రి కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కిక్కిరిసి పోయాయి. నగరంలోని దూల్‌పేట విగ్రహాల తయారీకి ప్రధాన కేంద్రం. ఇక్కడికి తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. చివరి నిమిషం వరకు కొనుగోళ్లు జరుపుతుంటారు.
ఈసారి కరోనా భయాలు సమసిపోకపోవడంతో సాధారణ స్థాయిలో విగ్రహాలు తయారు చేయలేదు. సాధారణంగా ఏడాది మొత్తం చేసే విగ్రహాల తయారీ ఈసారి కేవలం రెండు నెలల్లోనే చేశారు. దీంతో అందుబాటులో ఉన్న విగ్రహాల సంఖ్య తగ్గిపోయింది. చాలా మంది ఇప్పటికే విగ్రహాలను తీసుకెళ్లారు. పెద్ద విగ్రహాలను మండపాల నిర్వాహకులు తీసుకెళ్లగా చిన్న విగ్రహాలు మాత్రమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. చాలా మంది విగ్రహాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ తగినన్ని విగ్రహాలు అందుబాటు లేవు. విగ్రహాల కోసం వస్తున్న వారితో పాటు స్థానికంగా ఉండే వారు అలంకరణ, పూజ సామగ్రి కోసం రోడ్లపైకి రావటంతో జనసందడి పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది.