ఆరునూరైనా, వందకు వందశాతం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు కోసం లక్ష కోట్లయినా ఖర్చుచేస్తామని, తెలంగాణ ఎస్సీలు దేశానికే ఆదర్శవంతమవుతారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియా నియోజకవర్గంలో పర్యటించారు. రాష్ట్రంలో 17 లక్సల మంది దళితులున్నారని, వీరిలో దాదాపుగా 12 లక్షల మంది దళిత బంధుకు అర్హులేనని, బ్యాంకుతో సంబంధం లేకుండా దళిత బంధు పథకం కింద 10 లక్షలు వేస్తామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 కుటుంబాలకు వచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. ఎంతో మేథోమథనం తర్వాత దళిత బంధును తీసుకొస్తున్నామని, ప్రజలు బ్రహ్మాండమైన ఆదరణ చూపుతారని పేర్కొన్నారు. ఈ పథకం అమలైతే తమకు రాజకీయంగా పుట్టగతులుండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని, వందకు వంద శాతం ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
సాగర్ అభివృద్ధికి 150 కోట్లు…
హాలియ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పలు హామీలిచ్చారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి 150 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని సీఎం ప్రకటించారు. ఏడాదిన్నర లోపు అన్ని లిఫ్టులను పూర్తి చేస్తామని, బంజారాల కోసం బంజారా భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దేవరకొండలో ఐదు లిఫ్టులు, మిర్యాలగూడలో ఐదు లిఫ్గులు, నకిరేకల్, హుజూర్‌నగర్‌లో ఒక్కొక్క లిఫ్ట్ ఇలా మొత్తం 15 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటన్నింటినీ యేడాదిన్నర లోపే పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే చాలా సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటన్నింటినీ పూర్తి చేసి, అభివృద్ధి చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆరోగ్య కేంద్రాలను, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని, గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని తెలిపారు.