Skip to main content

Namaste NRI

నేటి నుంచి వింటర్ ఒలింపిక్స్

వింటర్‌ ఒలింపిక్స్‌ వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. 90 దేశాల నుంచి దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు, పక్షం రోజులకు పైగా సాగే సమరంలో పోటీపడబోతున్నారు. 7 క్రీడల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు జరగబోతున్నాయి. ఈ ఆటల కోసం బీజింగ్‌, యన్‌కింగ్‌, జాంగ్‌జియా నగరాల్లోని 13 వేదికలు ముస్తాబయ్యాయి.  బీజింగ్‌ జాతీయ స్టేడియంలో ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే కర్లింగ్‌, లూజ్‌, స్కై జంపింగ్‌, అల్పైన్‌ స్కీయింగ్‌, ప్రీస్టయిల్‌ స్కీయింగ్‌, ఐస్‌ హాకీ, స్కై జంపింగ్‌ విభాగాల్లో పోటీలు మొదలు కాగా పతకాల ఈవెంట్లు ఆరంభం కాబోతున్నాయి. 

      ఈ వేడుకలకు తాము వెళ్లబోమని అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ప్రకటించారు. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో ఆయా దేశాల అధినేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం తాను చైనాకు వెళ్తానని ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ వరకు తాను చైనాలో పర్యటిస్తానని తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో పాటు ప్రధాని లి కెక్వియాంగ్తో సమావేశమవుతానని తెలిపారు.

      వింటర్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో చైనా అధ్యక్షుడితో పాటు ప్రభుత్వ పెద్దలు పాల్గొంటారు. అలాగే చైనా మిత్ర దేశం రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ కూడా ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. అలాగే పలు దేశాలకు చెందిన 32 మంది నాయకులు ఈ వేడుకల్లో పాల్గొంటారని చైనా ప్రకటించింది.

Social Share Spread Message

Latest News