మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్ పరిసర ప్రాంతమైన ఇర్వింగ్ నగరంలో అమెరికా 250 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోనే అతిపెద్ద మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఈ వేడుకలు నిర్వహించారు. ఇర్వింగ్ నగర మేయర్ యాల్ జపంటా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికా జన జీవన స్రవంతిలో భాగమవుతూ ఇర్వింగ్ నగర ప్రగతికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన మహాత్మాగాంధీ మెమోరియల్ ఇర్వింగ్ నగరంలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నో దశాబ్దాలుగా టెక్సాస్ లో స్థిరపడిన ప్రవాస భారతీయులు టెక్నాలజీ, విద్యా,వైద్య రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అమెరికా జిడిపి ఎదుగుదలలో భాగస్వాములు అవడం అభినందనీయమని ప్రత్యేక అతిథిగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహిన్ పేర్కొన్నారు. 50 మందికి పైగా స్వర స్వాతి సింగింగ్ గ్రూప్ ‘ చిన్నారులు అమెరికా జాతీయ గీతంతో సహా అనేక దేశభక్తి గీతాలు ఆలకించడం ఆనందంగా ఉందన్నారు. ఈ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందన్నారు.


మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రజాస్వామ్య దేశాలలో అమెరికా ఒకటి. అమెరికా 250 వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించు కోవడం ఒక చారిత్రక ఘట్టం. ఈ రెండు శతాబ్దల ప్రయాణంలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాల నుండి వచ్చిన ప్రజలు వారితో పాటు వచ్చిన తమ భాషలు, సంసృతి, సంప్రదాయాలు ప్రతిభతో ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు. భారతీయ మూలమున్న అమెరికన్లు విద్య, ఉపాధి, వ్యాపారం, శాస్త్ర సాంకేతిక రంగాలు , వైద్యం ప్రజాసేవ ఇలా ప్రతి రంగంలో ఎదగడానికి ఈ దేశం విశాలమైన అవకాశాలు కల్పించింది. అందుకు కృతజ్ఞతలు. మన భారతీయ సంస్కృతిని విలువలను కాపాడుకుంటూ మనం అమెరికా సమాజంలో భాగస్వాములు కావాలి. స్వతంత్రం మనకు హక్కులను మాత్రమే ఇవ్వదు , భాద్యతలను కూడా గుర్తు చేస్తుంది. మనకు లభించిన స్వేచ్ఛను గౌరవించండి. వైవిద్యం ను ఆదరించండి.నిజాయితీని ఆచరించండి. మానవత్వంని పెంపొందించండి,ద్వేషం కంటే ప్రేమను ఎంచుకొని ముందుకు సాగాలని అన్నారు.


మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు రావు కల్వల, తయాబ్ కుండావాలా, మహేంద్ర రావు, రాజేంద్ర వంకవాలా, రాంకీ చేబ్రోలు, దీపక్ కార్ల, అనంత మల్లవరపు, మూర్తుజ భాయ్, సోనిట్ సింగ్, కలై కృష్ణమూర్తి తో సహా అనేక సంఘాల ప్రతినిధులు అదిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





























