హైదరాబాద్ వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్ బడా గణేష్‌కు ఎంతటి ప్రత్యేక గుర్తింపు ఉందో, బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాటకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ప్రతి ఏడాది ఎంతో ఆసక్తిగా జరిగే ఈ వేలం ఈసారి కూడా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది 21 కిలోల బాలాపూర్ మహాగణపతి లడ్డూ ప్రసాదం ఏకంగా రూ.39 లక్షల ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. 20 మందికి పైగా తీవ్రంగా పోటీపడిన ఈ వేలంపాటలో సామ ప్రణీత్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించారు. 2025లో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ రూ. 35 లక్షలకు దక్కించుకున్నారు.


బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు. లడ్డూను పొందిన వారు దానిని కుటుంబ సభ్యులు, బంధువులకు పంచడంతో పాటు, పంటలు సమృద్ధిగా పండాలని పొలాల్లో చల్లుతారు. ఇక వేలం పాట ద్వారా సమకూరిన నిధులను ఉత్సవ సమితి సభ్యులు బాలాపూర్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి, పాఠశాలల నిర్మాణానికి, ఇతర సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తుండటం ఈ వేలంపాటలోని మరో గొప్ప విశేషం.















