అమెరికాలో మరో భారతీయుడు అరెస్టయ్యాడు. సీనియర్ సిటిజన్ల ఖాతాలను దోచేసిన కేసులో వర్జీనియాకు చెందిన అనిరుధ్ కల్‌టోటెను అరెస్టు చేసి హ్యూస్టన్‌లో కోర్టులో హాజరుపరిచారు. సీనియర్ సిటిజన్ల నుంచి డబ్బులు దోచేందుకు వారికి కొందరు బెదిరింపు మెయిల్స్ పంపడం, ఇవ్వకుంటే దాడులకు దిగుతామని హెచ్చరించడం వంటివి చేశారు. హ్యూస్టన్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కొందరు భారతీయులు ముఠాగా ఏర్పడి వెస్ట్రన్ యూనియన్, మనీగ్రాం వంటి ట్రాన్స్‌మిటర్ బిజినెస్‌ల లింకులు పంపి వృద్ధుల ఖాతాల్లోని సొమ్ము కాటేశారు. హ్యూస్టన్‌లో ఆక్రమంగా నివసిస్తున్న మహమ్మద్ ఆజాద్ (25) అనే వ్యక్తితో కలిసి ఈ నేరానికి పాల్పడ్డారన్నది అనిరుధ్‌పై అభియోగం. ఆజాద్ 2020లోనే అరెస్టు చేశారు. నేరాలు రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్ష, 20 వేల డాలర్ల జరిమానా పడొచ్చు. బాధితుల వ్యక్తిగత వివరాలు బ్యాంకు, క్రెడిట్ కార్డు వివరాలు సైతం అపహరించారని న్యాయశాఖ తెలిపింది. ఇదే కేసులో సుమిత్ కుమార్ సింగ్ (24), హిమాంశు కుమార్ (24), ఎం.డి.హసీబ్ (26) తమ నేరం అంగీకరించారు. ఈ ముగ్గురు భారతీయులూ హ్యూస్టన్‌లో అక్రమంగా నివాసముంటున్నారు. వీరికి శిక్షలు ఖరారు కావాల్సి ఉంది.














