ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత విలువైన బహుమతి యోగా అని అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ సేతురామన్ పంచనాథన్ పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ముందుస్తు కార్యక్రమం నిర్వహించారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వాషింగ్టన్ స్మారకం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమానికి వందల మంది హాజరయ్యారు. అమెరికా ప్రభుత్వ అధికారులు, చట్టసభ్యులు, పారిశ్రామికవేత్తలు, రాయబార కార్యాలయాల సిబ్బంది, భారత ప్రతినిధులు పాల్గొన్నారు. శారీరక, మానసిక, ఆద్యాత్మిక శ్రేయస్సును యోగా పెంపొందిస్తుందని అమెరికాలో భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూ తెలిపారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని అయిదు భారత దౌత్య కార్యాలయాలూ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్, నయాగరా జలపాతం సహా పలు ప్రముఖ ప్రదేశాల వద్ద ముందస్తు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.














