వాస్తవాధీన రేఖ వద్ద యథాతథా పరిస్థితిని మార్చేందుకు చైనా చేసే ఏకపక్ష యత్నాలను భారత్ ఎట్టి పరస్థితుల్లో ఆమోదించదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. తూర్పు లడఖ్ వివాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ భారీ స్థాయిలో దళాలను తరలించిన వాస్తవాధీన రేఖ వద్ద చైనాను కట్టడి చేసిందన్నారు. 1993, 1996 నాటి ఒప్పందాలను చైనా ఉల్లంఘించి వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చాలని యత్నించిందన్నారు. మనం కొవిడ్ సమయంలో కూడా భారీగా దళాలను సరిహద్దులకు తరలించాము. ఈ విషయం దేశంలోని ప్రజలు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు గుర్తించాలి. మనం వాస్తవాధీన రేఖ వద్ద చైనా కట్టడి చేయగలము. చైనా దళాలు వాస్తవాధీన రేఖకు సమీపంలో మోహరించాయి. దీంతో భారత్ కూడా మోహరించింది. ఇది చాలా ప్రమాదకరం. తీలాంటి పరిస్థితుల్లోనే గల్యాన్ ఘటన చోటు చేసుకొందని తెలిపారు.














