అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. దేశ స్వాతంత్య్ర దినం సందర్భంగా షికాగో నగర శివారులోని ఐలండ్ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. వీరిలో కనీసం ఆరుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. కాల్పులు సమయంలో పరేడ్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చిన నేపథ్యంలో క్షతగ్రాతుల సంఖ్య ఇంకా పెరగవచ్చంటున్నారు. కాల్పులతో భయాందోళన లోనై వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. అతను కాల్పులు జరిపిన తుపాకీ దొరికనట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తొలుత అధికారులు చెప్పినా, రక్తం మడుగులో పడున్న మూడు మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన రోజు మృతులకు సంతాపం తెలపాల్సి వచ్చిందని మేయర్ నాన్సీ రోటరింగ్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో హైలాండ్ పార్క్ మేయర్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రద్దు చేశారు. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న తుపాకి సంస్కృతికి చెక్ పెట్టేందుకు బైడెన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరగడం గమనార్హం.














