అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారందరినీ ఒక్కచోటుకు చేర్చి పలు అంశాలపై నిర్మాణాత్మకంగా చర్చించేందుకు ఆటా మహాసభలు మంచి అవకాశాన్ని అందించాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వాషింగ్టన్లో టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావవేశంలో ఆమె పాల్గొన్నారు. విదేశాల్లో గొప్ప స్థానాల్లో స్థిరపడిన ప్రవాస తెలుగు ప్రజలు, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ ఏడాది జరిగిన ఆటా మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న అనేక గొప్ప కార్యక్రమాలను ప్రవాసులకు తెలియజేసేందుకు ఆటా మహాసభలు వేదికగా నిలిచాయని ఆమె అభిప్రాయపడ్డారు. విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసీయులు సొంత గడ్డ రుణం తీర్చుకునేందుకు వీలైనంత సహకారం అందించాలన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులు, పేదలు రెండు కండ్లుగా సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలిపిన దార్శనికుడు కేసీఆర్ అని అన్నారు. ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు. బీజేపికి ఒక విధానం, నినాదం లేదని, కేవలం విద్వేశాలను రెచ్చగొట్టడమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు. ఆరు దశాబ్దాలుగా దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దిక్కు లేకుండా పోయిందన్నారు. బీజేపీ పాలనలో తెలంగాణకు పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. యావత్ భారత్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమంటూ సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, గువ్వల బాలరాజు , చంటి క్రాంతి కిరణ్, బొల్లం మల్లయ్య, టిఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, టిఆర్ఎస్ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తదితరులు పాల్గొన్నారు.














