భారత్‌కు చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు, జైస్యూట్ క్రైస్తవ అర్చకుడు ఎల్గార్ పరిషత్ మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు ఫాదర్ స్టాన్‌స్వామి జ్యుడీషియల్ కస్టడీలో మరణించడంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేస్తూ అమెరికా చట్టసభలో ఓ తీర్మాన్ని ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యుడు జువాన్ వర్గాష్ దీన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ (చట్టసభ)లో ప్రవేశపెడుతూ మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన స్టాన్‌స్వామి జ్యుడీషియల్ కస్టడీలో మరణించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. ఆయన మరణంపై స్వతంత్ర దర్యాపు జరుపాలని, అప్పుడే నిజాలు బయటికి వస్తాయని తెలిపారు. కాగా 84 ఏండ్ల వయసున్న స్టాన్‌స్వామి గత ఏడాది జులై 5న ముంబైలో జైలులోనే మరణించారు.
స్టాన్ స్వామికి జైలులో గుండెపోటు రావడంతో ఆ మరుసటి రోజు అంటే నిరుడు మే 29న ముంబయిలోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే గుండె ఆగిపోయిన స్వామికి వెంటిలేటరు మీద శ్వాస ఏర్పాటు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఆయనకు పార్కిన్సన్ వ్యాధితో పాటు ఇతర రుగ్మతలూ ఉన్నాయి. పోలీసు కస్టడీలో స్టానీ స్వామిపై బలప్రయోగం జరిగిందనీ, ఆయన ఆరోగ్య స్థితిని ఘోరంగా నిర్లక్ష్యం చేశారనీ, ఇదంతా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోదని వార్గస్ వ్యాఖ్యానించారు.




























