తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశం శ్రీలంకకు భారత్ మరోసారి అండగా నిలిచింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల కోసం, ప్రగతి కోసం పోరాడుతున్న శ్రీలంక ప్రజలకు అండగా నిలుస్తామని విదేశీ వ్యవహారాలమంత్రి ఎస్. జైశంకర్ ఓ ప్రకటన చేశారు. ఆ దేశ రైతుల కోసం 44 వేల మెట్రిక్ టన్నుల యూరియాను క్రెడిట్ లైన్ కింద అందజేసింది. శ్రీలంకలోని భారత హైకమిషనర్ ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి అమరవీరను కలిసి యూరియా అప్పగింత వ్యవహారాన్ని పూర్తి చేశారు. మరోవైపు లంకలో తాజా పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందిస్తూ ప్రజా స్వామ్య విధానాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్లేందుకు లంకేయులను తామెప్పుడూ మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఇప్పటికే 380 కోట్ల డాలర్ల సాయం అందించామని, ఇక ముందు కూడా ఈ సాయం అందిస్తామని తెలిపింది.














