విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. అనన్య పాండే కథానాయిక. అపూర్వ మెహతా, కరణ్ జోహర్‌తో కలిసి పూరి జగన్నాథ్, చార్మి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ కథానాయకులు చిరంజీవి, ప్రభాస్ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చుని ట్రైలర్‌ని వీక్షించింది చిత్రబృందం. ఒక లయన్‌కి, టైగర్‌కి పుట్టిండాడు.. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ అనే రమ్యకృష్ణ డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ లైగర్ ట్రైలర్‌కి ఫ్యాన్స్ రచ్చ చూస్తుంటే మెంటలెక్కి పోతుంది. ఐ లవ్ యూ. ఈ సినిమా అభిమానులకు అంకితం చేస్తున్నాను అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ విజయ్ నెక్ట్స్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా..రాసి పెట్టుకోండి. మాకు సినిమా అంటే ఎంతో పిచ్చో చూపించడానికి కరణ్ జోహార్ గారిని ఇక్కడికి పిలిచాను అన్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో ఛార్మి, అపూర్వ మెహతా, అనన్య పాండే, అనిల్ తడాని తదితరులు పాల్గొన్నారు.














