దుబాయి లో క్రిస్మస్ ఉత్సవాలు అత్యంత ఆర్భాటంగా జరిగాయి. పర్యాటకుల కేంద్రమైన గ్లోబల్ విలేజీలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ చెట్టు అందర్నీ ఆకర్షించింది. సెంట్ మేరి చర్చి వద్ద జరిగిన ఏసు ప్రార్థనల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రార్థనల్లో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. యోహోవా షాలోమ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రకు చెందిన క్రైస్తవులు ఈ చర్చి వద్దే క్రిస్మస్ వేడుకలను జరుపుకొన్నారు. సంఘ కాపరి అడిదల సంపద రావు ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ ఉత్సవాలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఫెయిత్ చర్చికి చెందిన కె. ఏలియా రాజు ముఖ్య ప్రసంగికులుగా హాజరై తన సందేశాన్ని వినిపించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఎన్నార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ప్రసన్న సోమిరెడ్డి పాల్గోన్నారు. ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్లు అక్రం, మోహన్ రావు తదితరులు కూడా మాట్లాడారు. దుబాయి నగరంలో పని చేస్తున్న తెలుగు క్రైస్తవ మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గోన్నారు.














