అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా గగనతలంపై నిఘా బెలూన్ల కలకలం వివాదం రేపుతున్నది. తాజాగా మరో చైనా నిఘా బెలూన్‌ను గుర్తించామని, ఇది లాటిన్ అమెరికా గగనతలంపై ఎగురుతున్నదని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా తమ బెలూన్‌ను కూల్చివేయడంపై డ్రాగన్ ఘాటుగా స్పందించింది. పౌర గగన నౌక కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనికి అగ్రరాజ్యం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్ర ఉల్లంఘనేనని ఆరోపించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బెలూన్ సంచరించిన ఘటనను అమెరికా ప్రశాంతంగా డీల్ చేయాలని కోరుకున్నట్లు తెలిపింది.

తమ గగనతలంలో తిరుగుతున్న చైనా నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చివేసింది. దక్షిణ కరోనలీనా తీరానికి దగ్గర్లో దాన్ని కూల్చివేసినట్లు పెంటగాన్ తెలిపింది. దాని శకలాలు అట్లాంటిక్ సముద్రంలో పడిపోయాయని, బెలూన్ శిథిలాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. మోంటానా రాష్ట్రంలోని సున్నిత స్థావరాల గగనతలంపై నిఘా బెలూన్‌ను గుర్తించినట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, ఇది పౌర గగననౌక అని, దీన్ని వాతావరణ పరిశోధనల కోసం తామే ప్రయోగించామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. గాలుల ప్రభావంతో దారితప్పి వచ్చివుండొచ్చన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకోవడం గమనార్హం.














