Skip to main content

Namaste NRI

ఆ దేశ పౌరులకు..అమెరికా తీపి కబురు

ఇజ్రాయెల్ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా తీపి కబురు అందించనుంది. ఈ దేశ పౌరులను యూఎస్‌ను సందర్శించడాన్ని సులభతరం చేయాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ‘వీసా వీవర్ ప్రోగ్రాం లో ఇజ్రాయెల్‌ను కూడా చేర్చాలనే యోచనలో ఉంది. ఇక ఈ కార్యక్రమం అనేది నిర్దిష్ట దేశాల ప్రజలు 90 రోజుల వరకు ఎలాంటి వీసా లేకుండా అగ్రరాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ  ద్వారా ఇది నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా 40 దేశాలు లబ్ధి పొందుతున్నాయి. వీటిలో ఎక్కువగా యూరప్, ఆసియా దేశాలు ఉన్నాయి.

వీసా వీవర్ ప్రోగ్రాంకు ఇజ్రాయెల్‌ను జత చేయాలనే నిర్ణయం ఈ వారంలోనే వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియ రెండు దశలలో జరుగుతుంది. మొదటి దశలో ప్రోగ్రాంలో ఇజ్రాయెల్‌ను చేర్చేందుకు అధికారులు అప్రూవ్ చేయాలి. రెండో దశలో ప్రోగ్రామ్‌ను సిస్టమ్‌లో అమలు చేసి ప్రారంభించాల్సి ఉంటుంది. ఊహించని జాప్యాలు జరిగితే తప్ప ఇజ్రాయెల్‌ను ప్రోగ్రామ్‌లో చేర్చే ప్రక్రియలో రెండో దశకు సుమారు ఒకటి నుంచి ఒకటిన్నర నెలల సమయం పట్టవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం నాటికి దీనిపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ ప్రకటన చేసే అవకాశం ఉందట. అంతా అనుకున్నట్టు జరిగితే ఇజ్రాయెల్ పౌరులు ఈ ఏడాది చివరి నాటికి వీసాలు లేకుండానే అమెరికాకు  వెళ్లే వెసులుబాటు కలుగుతుంది.

Social Share Spread Message

Latest News