ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తమ నివాసితులు సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేలా ఒకే వీసా విధానాన్ని పరిశీలిస్తోందని యూఏఈ మంత్రి ఒకరు తెలిపారు. ఆ దేశ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రిని ఉటంకిస్తూ అతి త్వరలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టవచ్చని తెలిపారు. ప్రస్తుతం జీసీసీ దేశాల పౌరులకు మాత్రమే యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, ఖతార్‌కు వీసా ఫ్రీ-ట్రావెల్ సౌకర్యం ఉంది.ఇక ఈ దేశాల్లో ఉంటున్న ప్రవాసులు ప్రతి సభ్య దేశానికి ప్రయాణించాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. కొన్ని దేశాల వారికి మాత్రం వీసా ఆన్ అరైవల్ వెసులుబాటు ఉంది. ఒకవేళ ఈ సింగిల్ వీసా విధానం అమలులోకి వస్తే మాత్రం ప్రవాసులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. అబుదాబిలో జరిగిన ఫ్యూచర్ హాస్పిటాలిటీ సమ్మిట్‌లో అల్ మర్రి పాన్-జీసీసీ సింగిల్ వీసా గురించి మాట్లాడారు. ఈ ఏడాది ప్రారంభంలో బహ్రెయిన్ పర్యాటక మంత్రి ఫాతిమా అల్ సైరాఫీ తమ దేశానికి వచ్చే సందర్శుల కోసం జీసీసీ-వ్యాప్త స్కెంజెన్-శైలి వీసా కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అరేబియా ట్రావెల్ మార్కెట్ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏకీకృత వీసాను అమలు చేసేందుకు మంత్రివర్గం స్థాయి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ వ్యవస్థ అతి త్వరలో ప్రారంభించబడుతుందని ఆమె చెప్పారు.














