Namaste NRI

సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ సిద్ధం!

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచస్థాయి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం అత్యంత సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 14, 15వ తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ మైదానంలో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. 40 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన వేదికతోపాటు, ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు గవర్నర్, ఉప రాష్ట్రపతి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండడంతో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ మైదానంలో 13 ఎకరాల్లో ఈ సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ప్రభుత్వంతో 410 ఒప్పందాలు చేసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సుమారు రూ.9.80 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే సమయంలో రూ.2.70 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు.

నవంబరు 13వ తేదీనే సీఎం చంద్రబాబు విశాఖ చేరుకోనున్నారు. వచ్చే అతిథులకు ఆ రోజు రాత్రి నోవోటెల్‌ హోటల్‌లో విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశ, విదేశాలకు చెందిన రాయబారులు, కాన్సుల్‌ జనరళ్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపార రంగ ప్రముఖులు, అతిథుల కోసం నగరంలోని 26 హోటళ్లలో 1,200 గదులు సిద్ధం చేశారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు పర్యాటక ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉండడంతో విందు ఏర్పాటుచేసి, అక్కడ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సదస్సు నేపథ్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. నగర సుందరీకరణ కు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఓ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. రూ.42 కోట్లతో మొత్తం 212 అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతినిధులు పర్యటించే అవకాశం ఉన్న 17 రహదారుల్లో 64 కిలోమీటర్ల మేర తారు లేయర్లు, డివైడర్లకు రంగులు, సూచికలు, ఫుట్‌పాత్‌లకు టైల్స్‌ మార్పు, ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పచ్చదనానికే రూ.8.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రహదారుల వెంబడి ఉండే గోడలపై సదస్సు ఉద్దేశం, విశాఖ ప్రత్యేకత తెలిపేలా కుడ్య చిత్రాలు ఏర్పాటుచేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events