బ్రిటన్‌లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ లో లైఫ్ పీర్‌గా ఉదయ్ నాగరాజు ప్రమాణం చేశారు. ఈ సభలో చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వహిస్తారు. సాంస్కృతిక వారసత్వం ప్రతిబించించేలా, ప్రజా సేవ పట్ల నిబద్ధతను సూచిస్తూ ఆయన భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.

హౌస్ ఆఫ్ లార్డ్స్ చారిత్రాత్మక గదిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను ప్రతినిధులు అధికారికంగా పరిచయం చేశారు. అంతకుముందు ఊరేగింపు నిర్వహించారు. యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ సలహా మేరకు రాజు ఛార్లెస్-III ఉదయ్ నాగరాజుకు పీరేజ్‌ను ప్రదానం చేశారు. ఇక నుంచి ఆయనను అధికారికంగా బ్లూమ్స్‌బరీ లార్డ్ నాగరాజుగా పిలువనున్నారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో చేరిన అతి పిన్న వయసుడ్కిగా ఉదయ్ నాగరాజు ఘనత సాధించారు. పాలన, విద్య, విధానం, సామాజిక ఆవిష్కరణలు సహా ప్రజా జీవితంలో విశిష్ట సేవ, నాయకత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు లైఫ్ పీర్‌లను ప్రదానం చేస్తారు. లైఫ్ పీర్‌గా లార్డ్ నాగరాజు జీవితాంతం హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తన సేవలు అందించనున్నారు.















