అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సారథ్యంలో సంగీత సాహిత్య హాస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఎన్నటికీ మరచిపోమని అన్నారు.ఈ ప్రాంతంలో ప్రవాస తెలుగువారికి వినోదం, విజ్ఞానం, సాంస్కృతిక వారసత్వం అందించే లక్ష్యంతో మా సంస్థ పనిచేస్తుంది. మన తర్వాత తరం ఏదీ కొల్పోకూడదో, దాని కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఈ తరంపై ఉంది. పాత జ్ఞాపకాలు మరచిపోయినా, వాటిని చెరిపివేసినా, భావితరాలు మనల్ని క్షమించవు. అందుకే ఈ తరానికి వాటిని అందించటానికి సంప్రదాయబద్ధంగా వీటన్నింటినీ రూపకల్పన చేశామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. ప్రపంచంలోని తెలుగుదనాన్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి తెలుగు భాషకు, తెలుగు జాతికీ గుర్తింపు తెచ్చారు. 52 సంవత్సరాల జీడబ్ల్యూటీసీఎస్ ప్రస్థానంలో భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడుతూ, విశిష్టమైన పండుగలు, ఇతర వేడుకలు క్రమం తప్పకుండా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు అని వారు తెలిపారు.


సాయికాంత రూపొందించిన నృత్యాలు, వివిధ సంగీత పాఠశాలలకు చెందిన చిన్నారుల నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.పలురకాల వేషధారణతో.. చిన్నారుల పలు నృత్య కార్యక్రమాలు అన్నితరాల వారిని ఆకట్టుకున్నాయి. ఉగాది పండుగ ఘన సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో విందు భోజనాలను అందించారు.


ఈ వేడుకల్లో పూర్వ అధ్యక్షులు త్రిలోక్ కంతేటి, మన్నే సత్యనారాయణ, సుధా పాలడుగు, కృష్ణ లాం, సంస్థ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నే, రాజేష్ కాసరనేని, భానుప్రకాశ్ మాగులూరి, శ్రీనివాస్ గంగ , విజయ్ అట్లూరి, యువ సిద్ధార్ధ్ బోయపాటి, పద్మజ బేవర , శ్రీవిద్య సోమ, పావని తదితరులు పాల్గొన్నారు.
































