భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటలీ, ఇండియా మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కీలక దశకు చేరుకునే స్థితికి చేరాయన్నారు. 2025–2029 వరకు ఇండియా–ఇటలీ మధ్య ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను కూడా మోదీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య సంబంధాల పెంపునకు, భవిష్యత్ నిర్మాణానికి ఇది దోహదం చేస్తుందన్నారు. రెండు దేశాల మధ్య 20 బిలియన్ యూరోలు టార్గెట్గా వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇటలీకి చెందిన 400 సంస్థలు దేశంలో ఇప్పటికే సేవలందిస్తున్నాయని మోదీ తెలిపారు.

అనంతరం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని ఉన్నత స్థాయికి చేరాయని చెప్పారు. పూర్తిస్థాయిలో సంబంధాల్ని బలోపేతం చేసుకుంటామన్నారు. మోదీతో తాను ఏడుసార్లు సమావేశమైనట్లు మెలోని చెప్పారు.తనకు మోదీకి మధ్య పరస్పర స్నేహం, గౌరవం, విశ్వాసం ఉన్నాయన్నారు.





























