అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం వెళ్లిన ఒక హైదరాబాద్‌కి చెందిన యువకుడు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన విషాదకర ఘటన ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది. నార్త్ ఫిలడెల్ఫియాలోని రేమండ్ రోసెన్ హోమ్స్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో డోర్‌డాష్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల తెలుగు విద్యార్థి కుంచా అన్షుల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. దుండగులు పక్కా వ్యూహంతో ఒక ఖాళీగా ఉన్న ఇంటి అడ్రస్‌ను ఇస్తూ డెలివరీ ఆర్డర్ పెట్టి అన్షుల్‌ను అక్కడికి రప్పించారు. అతను ఆర్డర్ డెలివరీ చేసి తిరిగి వస్తుండగా, చాలా దగ్గర నుండి అతని తలపై కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అన్షుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఖాళీగా ఉన్న ఆ ఇంటి లోపల మూడు అన్‌ఓపెన్డ్ పిజ్జా బాక్స్‌లు, ఒక డెలివరీ బ్యాగ్ లభించడాన్ని బట్టి అతను డెలివరీ పూర్తి చేసిన వెంటనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఘటనా స్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజీలో నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు అన్షుల్ ఆహారాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అతనిని వెంబడించినట్లు స్పష్టంగా రికార్డ్ అయింది. పోలీసులు ఘటనా స్థలం నుండి బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులను ట్రాక్ చేసేందుకు డిటెక్టివ్‌లు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దీనిపై మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది. ఇక మృతుడు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందినవాడు.





























