అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుమారు 37 ఏళ్ల తర్వాత తొలిసారి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. ఇటీవల ఆధునికీకరించిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆయన తొలి ప్రయాణం చేశారు. నార్త్ డకోటాలో ఏర్పాటు చేసిన థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ప్రారంభోత్సవానికి ఆయన ఈ కొత్త విమానంలో వెళ్లారు. దాదాపు నాలుగు దశాబ్దాల విరామం అనంతరం అందుబాటులోకి వచ్చిన కొత్త అధ్యక్ష విమానంలో ఇదే తన తొలి ప్రయాణమని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.

మెడోరాలో నిర్వహించిన కార్యక్రమంలో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. 37 ఏళ్ల తర్వాత ఎయిర్ ఫోర్స్ వన్ అనే ఒక ప్రత్యేక విమానంలో ఇది తొలి ప్రయాణమని అన్నారు. ఇదొక అద్భుతమైన విమానమని ఆయన ప్రశంసించారు. తాను ఎంతగానో ఆరాధించే మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ పట్ల గౌరవ సూచకంగా ఈ పర్యటన సాగిందని చెప్పారు. వైట్‌హౌస్‌లోని రూజ్‌వెల్ట్ రూమ్‌లో భద్రపరిచిన ఆయన కాంగ్రెషనల్ మెడల్ ఆఫ్ హానర్‌ను ట్రంప్ స్వయంగా ఈ లైబ్రరీకి అందజేశారు. ఈ సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తొలి సిట్టింగ్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రికార్డు సృష్టించారు.





























