టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి అరుదైన ఆహ్వానం అందింది. ఆగస్టు 21న న్యూయార్క్‌లో జరిగే వార్షిక ఇండియా డే పరేడ్‌కు ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ నేతృత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ప్రకటించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి. కవాతులో అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ గా వ్యవహరిస్తారని ఎఫ్ఐఏ అధ్యక్షుడు కెన్నీ దేశాయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, పలువురు ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, కైలాస్ ఖేర్‌లు అలరించబోతున్నారని తెలిపారు. అల్లు అర్జున్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.














