విదేశీ విద్యార్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇవ్వబోతున్నారా? ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ పూర్తి చేసి తద్వారా మెరుగైన ఉద్యోగం, హెచ్-1బీ వీసా సాధించాలనుకొనే విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లబోతున్నారా? తాజా వార్తలను బట్టి చూస్తే ఇది నిజమేననిపిస్తున్నది. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, ఓపీటీ చేయాలనుకొనే విద్యార్థులకు లక్ష డాలర్ల ఫీజు (రూ.95 లక్షలు) విధించాలనే ప్రతిపాదనలను ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే, అమెరికాలో చదువు పూర్తిచేసి అక్కడే ఉండి మెరుగైన ఉద్యోగం చేయాలనుకొనే వారికి పెద్ద ఎదురు దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ, ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఓపీటీ ప్రోగ్రామ్‌పై విద్యార్థులు ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్తున్నారు.

డిగ్రీ పూర్తైన విదేశీ విద్యార్థులు ఎలాంటి వర్క్ వీసా అవసరం లేకుండా అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెసులుబాటు కల్పించేదే ఓపీటీ. ఎఫ్-1వీసాతో అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత 1-3 ఏండ్లపాటు తమ రంగంలో అనుభవం పొందేందుకు ఈ ఓపీటీ ప్రోగ్రామ్ సాయపడుతుంది. ఓపీటీకి ఎంపికైతే తొలి ఏడాది అక్కడి సంస్థల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. స్టెమ్ కోర్సులు (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) పూర్తి చేసిన వారికి అదనంగా మరో రెండేండ్లు పనిచేసే వెసులుబాటు లభిస్తుంది. ఇదేసమయంలో పలువురు తమ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకొని హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకొంటారు. అయితే, ఇప్పుడు ఓపీటీ చేయాలనుకొనే విద్యార్థులకు లక్ష డాలర్ల ఫీజు విధించాలనే ప్రతిపాదనలను ట్రంప్ సర్కార్ తెరమీదికి తీసుకురావడంతో విదేశీ విద్యార్థులు పునరాలోచనలో పడినట్లయ్యింది.





























