గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్ చైనాను తాకింది. టైఫూన్ బెబింకా చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో తీరాన్ని దాటింది. దాదాపు 2.5 కోట్ల జనాభా కలిగిన షాంఘై నగర జనజీవనం ఒక్కసారిగా స్తంభించి పోయింది. ఇక్కడి జాతీయ రహదారుల్ని మూసేయించారు. షాంఘైలో రెండు విమానాశ్రాయాల నుంచి రాక పోకలు సాగించాల్సిన విమానాలన్నీ రద్దయ్యాయి. విమాన ప్రయాణికులకు తాత్కాలిక బస ఏర్పాటుచేసినట్టు అధికారులు ప్రకటించారు.
రెండు రోజులపాటు షాంఘై రైల్వే స్టేషన్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. తూర్పు చైనాలోని అహూయి ప్రావిన్స్‌కు లెవల్-4 స్థాయి, షాంఘై, ఝిజియాంగ్ నగరాలకు లెవల్-3 ప్రమాద హెచ్చరికలు జారీచేసినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిసింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో 4,14,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.