బ్రహెయిన్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ వేధింపులకు గురవుతున్న భారతీయలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర విదేశీ వ్వవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. యాజమాన్య దాష్టీకంతో చాలామంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తునానని, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు పలువురు సిద్దంగా ఉన్నట్లు ఆ లేఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. వీరిలో చాలామంది తెలుగువారు ఉన్నారని తెలిపారు. వీరిని వెనక్కి తీసుకురావడానికి అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖకు ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా ఏపీ రెసిడెంట్ కమిషనర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను సంప్రదించాలని వైఎస్ జగన్ ఆ లేఖలో సూచించారు.