తైవాన్ మిలటరీతో సంబంధాలు పెట్టుకోవడాన్ని అమెరికా తక్షణమే నిలిపివేయాలని, చైనా కీలక ప్రయోజ నాలను గౌరవించాలని చైనా కోరింది. తైవాన్ అంశం చైనాకు చాలా కీలకమైనదని చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ ఝాంగ్ యోక్సియా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజింగ్‌లో పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్‌తో సమావేశమైన ఝాంగ్, తైవాన్‌కు ఆయుధాలు అందచేయ డాన్ని ఆపాలని, తైవాన్‌కు సంబంధించిన తప్పుడు వార్తలను, పుకార్లను ఆపాలని కోరారు. ఈ మేరకు చైనా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా-అమెరికా సంబంధాలకు తైవాన్ అంశం రాజకీయ పునాదిని వేస్తుందని పేర్కొన్నారు. గీసిన లక్ష్మణ రేఖను దాటరాదన్నారు. తైవాన్ జలసంధిలో శాంతి సుస్థిరతలు కొనసాగాలని చైనా కోరుకుంటుందని, అయితే తైవాన్‌ను చైనా నుండి విడదీయడానికి ప్రయత్నం జరిగితే మాత్రం ఇది సాధ్యం కాదని హెచ్చరించింది.
తైవాన్ స్వాతంత్య్రాన్ని కోరుకునే మద్దతుదారులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఝాంగ్ చెప్పారు. వేర్పాటువాద శక్తుల నిర్లక్ష్యపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రతిఘటిస్తామన్నారు. చైనా పట్ల గల వ్యూహాత్మక వైఖరిని అమెరికా సరిదిద్దుకోవాలన్నారు. ఇరు దేశాల సాయుధ బలగాల మధ్య సహకారాన్ని పెంపొందించాలని కోరారు.